హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి మండలకేంద్రంలో ఇంటర్నేషనల్ సూల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అందుకు కావాల్సిన భూములను గుర్తించాలని, విద్యాబోధన, వసతుల కల్పనపై ఆధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో 2024-25 వార్షిక బడ్జెట్లో విద్యాశాఖ ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖలో అమలవుతున్న పథకాలు, విద్యావ్యవస్థ నిర్వహణపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉపాధి కోర్సులను తీసుకురావాలని, విద్యార్థుల చదువు పూర్తికాగానే ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు ఉండాలని సూచించారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో వర్సిటీలు లేనందున ఏర్పాటుకు ప్ర ణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనుమతులు లేని ప్రైవేటు యూనివర్సిటీల అడ్మిషన్లపై వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.