వికారాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్లయినా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా నదీ జలాల వాటా తేల్చే దిక్కులేదని, ఒక నది నీళ్లను రెండు రాష్ర్టాలకు పంచడానికి ఇంతకాలం పడుతుందా? అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తాండూర్ కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు ధ్రువీకరణ పత్రం ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి యాలాల రైతు ఉత్పత్తిదారుల సంఘానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా నది జలాల వాటా తేల్చేందుకు ఇంకెంత సమయం కావాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నిర్మించి 40 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నదని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఆసియాలోనే అతిపెద్ద పంపులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తాండూర్ కందికి భౌగోళిక గుర్తింపు రావడం రైతుల విజయమని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ కే నిఖిల తదితరులు పాల్గొన్నారు.