Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు, సంబంధిత మంత్రి మంత్రి భేటీ అయ్యారు. కైట్ ప్లేయర్లు రకరకాల పతంగులు తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే గాలిపటాల పండుగ ఏర్పాట్లపై చర్చించారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భవిష్యత్‌లో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించేందుకు సలహాలు సూచనలు, ప్రతిపాదనలు అందజేయాలన్నారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్ నెలవుగా మారిందన్నారు.
హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 16 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తమ ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లతో పాటు తెలంగాణ వంటకాలను పుడ్ కోర్టులో విక్రయిస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారన్నారు. వీక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. రాబోయే రోజుల్లో కైట్ స్వీట్ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు.