హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: రాష్ట్ర ఇంటర్బోర్డులో భద్రతా వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడినట్టు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ జరిగినట్టు తెలియడంతో తాము అప్రమత్తమయ్యాయని చెప్పారు. దీని వెనుక సూత్రధారులెవరో, ఏ అవసరాల కోసం ఈ చర్యకు పాల్పడ్డారనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బోర్డుకు సంబంధించిన ఓ అధికారిని, ఓ వ్యక్తి బెదిరించి పాస్‌వర్డ్‌ను తసరించినట్టు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు.
వ్యవస్థ ఓ వ్యక్తి గుప్పెట్లో!: నవీన్‌మిట్టల్
ఇంటర్ కమిషనర్‌కు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తున్నదని, ఓ వ్యక్తి వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొన్నారని నవీన్‌మిట్టల్ ఆరోపించారు. ‘సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారు. కెమెరాల్లో డాటా చోరీ అయ్యింది. నేను ఒక అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి చేరాయి. దీనిపై ఆరా తీస్తే సీసీ కెమెరాల ట్యాంపరింగ్ బయటపడింది. సీసీ కెమెరాల పాస్వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి చేతిలో ఉన్నాయి. గతంలో మాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా ఆయా వ్యక్తులు డబ్బులు సంపాదించేవారు. దీంతోనే ఆన్‌స్క్రీన్ మూల్యాంకన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపుల వంటి అనేక క్రిమినల్ కేసులతో సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్, బోర్డు అధికారులపై అనేక ఆరోపణలు చేశారు. సంబంధంలేని, అర్హత లేని వ్యక్తి మూల్యాంకన విధానంపై అనుమానాలు, అపోహలు సృష్టించారు. మంచిపని చేస్తుంటే సస్పెండైన వ్యక్తికి అంత నొప్పి ఎందుకో అర్థం కావడం లేదు. బోర్డును పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకొన్న కొంతమంది తమ చేతుల నుంచి వ్యవస్థ చేజారుతున్నదన్న అక్కసుతోనే బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కొందరు ఇంటర్ బోర్డును ఆదాయ వనరుగా మార్చుకున్నారని, ఇకపై వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిపై కేసు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిపై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రధాన కార్యాలయంలోకి మధుసూదన్‌రెడ్డి బలవంతంగా, దౌర్జన్యంగా ప్రవేశించి కంప్యూటర్లో పాస్‌వర్డ్‌ను మార్చాడని బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. మధుసూదన్‌రెడ్డిపై ట్రెస్ పాస్ సెక్షన్ 448, క్రిమినల్ ఇంటిమేషన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్పెక్టర్ నమిండ్ల శంకర్ తెలిపారు.