హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యతో పెట్టుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికెళ్లడం ఖాయమని, ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి 2034 వరకు సీఎం కొనసాగడం సంగతేమో గానీ, 2028 వరకు ఉంటారా? అనేది అనుమానమేనని పేర్కొన్నారు. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయంలో ‘జంగ్ సైరన్’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, ఉద్యోగ, అధ్యాపక సంఘాల నేతలు ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్.. ఇంటర్ విద్యను కాపాడుకుందాం’ అంటూ నినదించారు.
ఇంటర్ విద్య విలీన యోచనను తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. 55 కాలేజీలున్న పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమానికే సర్కార్ వణికిపోయిందని, 430కి పైగా కాలేజీలు, 10 లక్షల మంది విద్యార్థుల ఉద్యమానికి సర్కార్ పతనంకాక తప్పదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియడం లేదని ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కాలేజీలతో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, శాంతాసిన్హాకు ఏం సంబంధమని, వారితో కమిటీ వేయడమేంటని ప్రశ్నించారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఏపీలో ఇచ్చిన సలహాలే జగన్మోహన్రెడ్డిని నిండా ముంచాయని, రేవంత్‌రెడ్డి కూడా జగన్‌లా 11 సీట్లకే పరిమితమయ్యే రోజులు వస్తాయని హెచ్చరించారు.
ఏపీలో 502 స్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రారంభిస్తే, 130 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయయని, చివరికి ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన విషయం గుర్తుంచుకోవాలని మధుసూదన్‌రెడ్డి సూచించారు. ఏపీలో విఫలమైన ప్రయోగాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో 1,400 గురుకులాల్లో ఇంటర్ విద్యలో 82వేల మంది ఉంటే, 431 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఒక్క ఫస్టియర్‌లోనే 92వేల మంది ప్రవేశాలు పొందారని, ఇంత చక్కగా నడుస్తున్న వ్యవస్థను నిర్వీర్యం చేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రిన్సిపాళ్ల అసోసియేషన్, గెస్ట్ ఫ్యాకల్టీల సంఘం నాయకులు కృష్ణకుమార్, కనకచంద్రం, మాధవరావు, బలరాంజాదవ్, రజిత, కవితాకిరణ్, లక్ష్మి, శివకుమార్, యాకూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.