ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 23: ఓ యాచకుడి చావుకు కారకుడయ్యాడు మెండోరా డిప్యూటీ తహసీల్దార్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం సాయంత్రం మెండోరా డీటీ రాజశేఖర్ కారులో సిగ్నల్ వద్ద ఆగి ఉం డగా, శివరాం అనే యాచకుడు కారు అద్దాన్ని తుడిచి, డబ్బులు ఇవ్వాలని కోరగా లేవని చెప్పాడు. అంతలోనే గ్రీన్‌సిగ్నల్ పడటంతో శివరాం కారు వెంట పరుగుపెట్టాడు. కారు ఆపి దిగిన రాజశేఖర్ యాచకుడిని కాలితో తన్నాడు. అదే సమయంలో ఓ టిప్పర్ రావటంతో దాని వెనుక టైర్ల కింద పడి శివరాం అక్కడికక్కడే మృతి చెందాడు. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబీకులు శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.