హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రూ.2 వేల నోట్ల రద్దు వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అకస్మాత్తుగా ఆర్బీఐ నుంచి ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టాలనే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ నిర్ణయానికి ఒడిగట్టిందని ఆరోపించారు.
గతంలో యూపీ ఎన్నికల ముందు కూడా అప్పటి ఎస్పీ పాలక ప్రభుత్వాన్ని ఎన్నికల్లో బలహీన పరిచే ఉద్దేశంతో పెద్ద నోట్లు రద్దు చేశారని, అదే తరహాలో ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు పాపం ఇప్పటికీ దేశాన్ని పట్టిపీడిస్తున్నదని పేర్కొన్నారు. తన అసమర్థ పాలనతోనే దేశాభివృద్ధికి, ప్రజలకు జరిగిన తీవ్ర నష్టానికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.