హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్లో కబ్జాకు గురైన రైతుల భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ప్రహరీ గేటుపై రోజుకో కంపెనీ పేరు మారుస్తూ ఆటలాడుతున్నారు. కబ్జాకోరులు రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు చోద్యం చూస్తున్నారు. రూ.6 వేల కోట్ల విలువైన రైతుల భూములపై కబ్జాకోరులు తమకు నచ్చిన పేర్లను రోజుకొక్కటిగా మారుస్తున్నా అధికారుల్లో చలనం లేకుండా పోతున్నది.
ఆయా కంపెనీలకు కొమ్ముకాస్తూ వేడుక చూస్తున్నారని నాదర్గుల్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రహరీ మెయిన్ గేట్పై గతంలో కోహినూర్ కంపెనీ పేరు ఉండగా దాని పక్కన మేఘా-శిల్పా ఇన్ఫ్రా పేర్లను చేర్చారు. తాజాగా మేఘా-శిల్పా ఇన్ఫ్రా పేరును తొలగించి ఊరూ పేరు లేని ఇంప్లీక్స్ ఇన్ఫ్రా పేరును చేర్చారు.
అసలు ఇంప్లీక్స్ ఇన్ఫ్రా పేరుతో ఎక్కడా ఎలాంటి పనులు జరగడం లేదు. ఆ కంపెనీ కార్యకలాపాలు జరిగిన దాఖాలాలూ లేవు. ఇప్పుడు ఆపేరును చేర్చి కోహినూర్-ఇంప్లీక్స్ ఇన్ఫ్రా జాయింట్ డెవలప్మెంట్ అని కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. రోజుకో పేరును చూస్తున్న స్థానికులు అసలు నాదర్గుల్ భూముల విషయంలో ఏం జరుగుతున్నదో అర్థంకావడం లేదని పేర్కొంటున్నారు.