బాలానగర్, మే 16 : బాలానగర్ పారిశ్రామిక వాడలోని కేంద్ర ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థ ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయాల టెండర్‌ను రద్దు చేసి తిరిగి పిలవాలని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, సంస్థ ఆస్తులను కాపాడాలని కోరుతూ ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు మంగళవారం రిలే దీక్షకు దిగారు. వీరికి పాటిమీది జగన్మోహన్రావు, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, కూకట్పల్లి ఎ-బ్లాక్ ఉపాధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు రాజశేఖర్ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద ఫార్మా కంపెనీగా అవతరించిన ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వం తప్పుడు విధానాలతో లాకౌట్ చేసి అందులో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులను రోడ్డున పడేసిందని ఆరోపించారు. కంపెనీలోని మిషనరీకి వందేండ్లకుపైగా పనిచేసే సామర్థ్యం ఉన్నదని, సంస్థ జనరల్ మేనేజర్, ఇన్చార్జి మేనేజర్లు ఆ విషయాన్ని దాచిపెట్టి విక్రయాలు జరిపారని మండిపడ్డారు. దేశ సంపదను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.