హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై రెండో రోజైన మంగళవారం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, అతడి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాన్ని నిగ్గుతేల్చాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ముత్యాలమ్మ ఆలయానికి ఎదురుగానే ఉన్న హోటల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతుల కోసమని వచ్చిన 140 మందిలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్పోకెన్ ఇంగ్లిష్ పేరిట మతఛాందసవాద తరగతులను నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపించారు.
ముత్యాలమ్మ ఆలయానికి ముందు ఈ హోటల్ ఉండగా, వెనుక వైపు ప్రార్థనా మందిరం ఉన్నది. హోటల్ నుంచి అక్కడికి వెళ్లే వారంతా ఈ గుడి ముందు నుంచే వచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే హోటల్‌పై పోలీసులు దాడి చేసి, కంప్యూటర్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొత్త వారందరినీ ఖాళీ చేయించి స్వస్థలాలకు పంపించారు. ఇతర ప్రార్థనా మందిరంలో బసచేసిన యువకులూ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నిందితుడు దవాఖానలో పోలీసులకు సహకరించలేదని సమాచారం. ఉన్మాదిగా మారిన ఆ వ్యక్తిపై ఇప్పటికే ముంబైలో రెండు కేసులు ఉన్నాయని సమాచారం. అతని గత చరిత్ర గురించి ఆరా తీసేందుకు పోలీస్ బృందాన్ని ముంబైకి పంపారు. ఈ ఘటనపై, నిందితుడి వివరాలపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. బుధవారం ఈ ఘటనపై స్పష్టత ఇస్తామంటూ నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు.