హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/కంది/మిర్యాలగూడ రూరల్: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. హాస్టల్ నుంచి బయలుదేరిన ఆ యువకుడు 8 రోజుల అనంతరం విశాఖ బీచ్‌లో విగతజీవిగా మారాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాకు చెందిన ధనావత్ ఉమ్లానాయక్, సైదమ్మ కుమారుడు కార్తీక్ (21) కంది ఐఐటీ (హైదరాబాద్)లో బీటెక్ (మెకానికల్) సెకండియర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 17న హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. 17న తల్లిదండ్రులతో కార్తీక్ ఫోన్లో మాట్లాడాడు. మరునాడు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు 19న కళాశాలకు వెళ్లి ఆరాతీశారు. జాడలేకపోవడంతో కంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా విశాఖకు రైలులో వెళ్లినట్టు గుర్తించారు. తల్లిదండ్రులతో సహా పోలీసులు అక్కడికి వెళ్లి వెతకసాగారు. వైజాగ్ ఆరీలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీచ్ వద్ద సోమవారం రాత్రి ఒక మృతదేహం ఉందని సమాచారం అందింది. గుర్తించ వీలులేకపోవడంతో ప్యాంట్ జేబులో లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడు కార్తీక్‌గా గుర్తించారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహం కుళ్లిపోయి ఉన్నది. సముద్రంలో దూకి కార్తీక్ ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సెమిస్టర్లో తప్పడం వల్లే కార్తీక్ మనస్తాపానికి గురై సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకొన్నట్టుగా మృతుడి కుటుంబసభ్యులూ భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి, మంగళవారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.