అల్లుడి కోసం 3 కోట్లు వదిలేసిన టాస్క్‌ఫోర్స్
నగరంలోని ప్రధాన జోన్లో హైడ్రామా..ముందుగా సీజ్ చేసి తీసుకెళ్లిన పోలీసులు.
- ఒక్క ఫోన్‌కాల్‌తో వెనక్కి తెచ్చిచ్చిన వైనం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని వెంగళరావునగర్కాలనీ.. మంగళవారం సాయంత్రం 4గంటలకు.. డ్రగ్ కంట్రోల్ బోర్డుకు సమీపంలోని ఓ భవనం.. కింద ఒక స్టడీ సర్కిల్, మూడో ఫ్లోర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మఫ్టీలో పోలీసులు అక్కడికి వచ్చారు. టేబుల్‌పై ఉన్న సుమారు రూ.3 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పకుండా నీళ్లు నమలడంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు.
సీన్ కట్ చేస్తే.. సరిగ్గా గంట తర్వాత ఆ పోలీసులు అదే భవనం వద్ద ప్రత్యక్షమయ్యారు. సీజ్ చేసిన తీసుకెళ్లిన డబ్బులను తిరిగి అక్కడున్న మనుషులకు అప్పగించారు. మరి గంట సేపట్లో ఏం జరిగింది? ఆ డబ్బులెక్కడివి? అక్కడ ఉన్న మనుషులెవరు? రైడ్ చేసిన పోలీసులు ఆ డబ్బులను ఎందుకు తిరిగి ఇచ్చారు? ప్రస్తుతం నగర పోలీస్ కమిషనరేట్‌లోని నిఘా, ప్రత్యేక పోలీసు బృందాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది.
హడావుడి చేసి.. సీజ్ చేసి
ఈ నెల 26న సాయంత్రం 4 నుంచి 6గంటల మధ్యలో వెంగళరావునగర్ కాలనీలో పోలీస్, పొలిటికల్ హైడ్రామా జరిగింది. డబ్బులకు సంబంధించి నేరపూరిత లేదా అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని అందిన విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్సై ఆ భవనానికి వచ్చారు. మూడో అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న వ్యక్తులతో తాము టాస్క్‌ఫోర్స్ నుంచి వచ్చామని, మీ దగ్గర ఏదైనా డబ్బుల లావాదేవీలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. వారు అదేమీ లేదని చెప్పారు.
కానీ పోలీసులు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ గట్టిగా దబాయించడంతో.. అక్కడున్నవారు లోపల రూమ్‌లో టేబుల్‌పై ఉన్న రూ.2.99 కోట్ల నగదు కట్టలను చూపించారు. ఇంత డబ్బుతో ఇక్కడ ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నిస్తే, వారి వద్ద సమాధానం లేదు. డబ్బులకు సంబంధించిన రసీదు గానీ, అవి ఎక్కడినుంచి వచ్చాయో చెప్పలేకపోయారు. దీంతో పోలీసు అధికారులు డబ్బును సీజ్ చేశారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలతో ఆఫీస్‌కు రావాలని చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. వాస్తవానికి ఆ డబ్బులు నల్లడబ్బు కావడంతో వాటిని వైట్లోకి మార్చడానికి ఒక ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన కంపెనీతో లావాదేవీలు నడుపుతున్నారని, ఈ మేరకు డబ్బులు మార్చుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ముఖ్యనేత అల్లుడి రక్తసంబంధీకులవేనా?
డబ్బులు సీజ్ చేసిన సరిగ్గా గంట తర్వాత మళ్లీ అదే పోలీసు అధికారులు అదే స్థలానికి వచ్చారు. ఆ డబ్బులను పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చారు. కేవలం గంటలోపే డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చారంటే ఏం జరిగి ఉంటుందని పోలీసువర్గాలు చర్చించుకుంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ డబ్బు లు ‘ముఖ్యనేత’ అల్లుడి రక్తసంబంధీకులవట. డబ్బులు సీజ్ చేసి తీసుకెళ్తున్న సమయంలోనే ముఖ్యనేత ఇంటి నుంచి అటు పోలీస్, ఇటు టాస్క్‌ఫోర్స్ పెద్దలకు ఫోన్ వెళ్లిందని ప్రచారం జరుగుతున్నది.
అంతే సీన్ మొత్తం తారుమారైంది. వారితో ముఖ్యనేత అల్లుడు మాట్లాడినట్టు సమాచారం. అవి నల్లడబ్బా, తెల్లడబ్బా? అనే లెక్కలు అవసరం లేదని, అసలు మీకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చీవాట్లు పెట్టాడని తెలిసింది. ఆ తర్వాత ముఖ్యనేత కూడా ‘ముచ్చట బయటకు రానీయకుండా.. ఎక్కడికక్కడ వదిలేయండి’ అంటూ చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే ఆ పోలీసులకు ఫోన్ చేసి ‘మీరెందుకు అక్కడికి వెళ్లారు? ఇలాంటివి చేసి నాకెందుకు తలనొప్పులు తెచ్చిపెడ్తారు?’ అని చీవాట్లు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో వారు హైరానా పడ్డారని, తాము సీజ్ చేసిన డబ్బులను స్వయంగా వెనక్కి తీసుకెళ్లి ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం నగర పోలీస్ కమిషనరేట్‌లోని ప్రత్యేక, నిఘా బృందాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ డబ్బులు ఏ కంపెనీకి చెందినవి? ఎవరి డబ్బులను వైట్ చేయడానికి ఎంత కమీషన్‌తో మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు? అంటూ ఆరాలు తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

