హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు కలిపేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ఇంటర్ చేంజ్‌లు నిర్మించే ప్రాంతాల ఎంపిక పూర్తయింది. పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవేగా రూపొందిస్తున్న ఈ రహదారికి 11 ప్రాంతాల్లో ఇంటర్‌చేంజ్‌లు రానున్నాయి. వీటిని జాతీయ రహదారుల సంస్థ ఇటీవలే ఫైనల్ చేసింది. తద్వారా నగరం నుంచి ట్రిపుల్ఆర్కు సులువుగా వెళ్లేలా ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్కు అవతల 30 కిలోమీటర్ల దూరంలో ఉండే రీజినల్ రింగ్ రోడ్డుకు సైకిల్ రిమ్కు యాక్సిల్‌కు మధ్యలో ఉండే పుల్లల మాదిరిగా ప్రత్యేకంగా రోడ్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది.
ట్రిపుల్ఆర్, ఓఆర్‌ఆర్‌లను కలిపే లింకు రోడ్లకు స్పైక్ రోడ్లుగా నామకరణం చేశారు. దాదాపు 50 స్పైక్ రోడ్లకు నిర్మించాలని నిర్ణయించారు. పురపాలక, గ్రామీణాభివృద్ధిశాఖ, ఆర్అండ్బీలు సంయుక్తంగా ఈ రోడ్లను నిర్మించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీపీఆర్ తయారు చేయాలన్నారు. డీపీఆర్ తయారీ బాధ్యతను సర్కారు హెచ్ఎండీఏకు అప్పగించినట్టు తెలిసింది. ఈ రోడ్ల నిర్మాణానికి దాదాపు 2500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు సమాచారం.
నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లింక్ కోసం ఏవిధంగా రేడియల్ రోడ్లు నిర్మించారో అదే తరహాలో ఈ స్పైక్ రోడ్లను నిర్మించనున్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలకు లింక్ ఇస్తే ఈ స్పైక్ రోడ్లు సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్-ఆమన్‌గల్ – యాచారం-కందుకూరు-షాద్‌నగర్-చేవెళ్ల-కంది ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటాయని అధికారులు తెలిపారు. వీటితోపాటు హైదరాబాద్ నగర శివార్లలో ట్రకు పారులు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లకు చేరుకొనే వాహనాల రాకపోకలకు ఈ స్పైక్ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంచనా వేశారు. ఈ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలు ఓఆర్ఆర్ ద్వారా వేగంగా రీజినల్ రింగ్ రోడ్డుకు చేరుకునేట్టు స్పైక్ రోడ్లు దోహదం చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చిన వాహనాలైనా ఇంటర్ చేంజ్ల వద్దనే ట్రిపుల్ ఆర్ ఎక్కడానికి, దిగడానికి అవకాశం ఉంటుంది.