హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సున్నితమైన గాజు వస్తువులు మొదలు విలువైన ఎలక్ట్రిక్ సామాన్ల వరకు అన్నింటి ప్యాకింగ్‌కు థర్మకోల్ను వాడటం సర్వ సాధారణం. అయితే థర్మకోల్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అనేక వస్తువులు ఉండగా.. థర్మకోల్‌కు మాత్రం ప్రత్యామ్నాయం లేదు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘పోర్సిని పార్సెల్స్’. హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థినులు వడ్ల ప్రణవి, గాంబో అనుపమలు వస్తువుల ప్యాకింగ్ కోసం చేసిన ఈ నూతన ఆవిష్కరణకు వీ-హబ్, వైఎఫ్ఎస్ఐల నుంచి ప్రశంసలు, పురస్కారాలు లభించాయి. త్వరలోనే థర్మకోల్‌కు ప్రత్యామ్నాయంగా ఈ విద్యార్థినులు మష్రుమ్ వ్యర్థాలతో ప్యాకింగ్ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఆలోచన వీరికెలా వచ్చింది?
కళాశాల ల్యాబ్‌లో ప్రయోగాలకు వాడే గాజు వస్తువుల ప్యాకింగ్ వెంట వచ్చిన థర్మకోల్ను ఓ మూలన పడేయటాన్ని ప్రణవి, అనుపమ చూశారు. థర్మకోల్ వ్యర్థాలతో అటు పర్యావరణానికి, ఇటు ప్రజా ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు ఏదైనా చేయాలని వారు ఆలోచించారు. తమ కళాశాలలోని ల్యాబ్‌లో పుట్టగొడుగులను పెంచిన తర్వాత వృథాగా పారబోసే వ్యర్థాలనే తమ ఇన్నోవేషన్‌కు వాడుకోవాలని భావించి ఆదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ప్రయోగాత్మకంగా ఆచరణలోకి
ఓ సందర్భంలో కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థినులు పూలు, పండ్లకు సంబంధించిన వ్యర్థాల నుంచి సౌందర్య సాధనాలను తయారు చేశారు. ఇదే ప్రణవి, అనుపమలకు స్ఫూర్తినిచ్చింది. మష్రూమ్ వేస్ట్‌తో ప్యాకింగ్ స్టఫ్‌ను తయారు చేయాలన్న తమ ఆలోచనను ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చేందుకు ఎన్నో పరిశోధనలు చేశారు. పుట్టగొడుగులను వలిచాక మిగిలిపోయిన వ్యర్థాలను ఎండుగడ్డితో కలిపి మౌల్డ్‌లో పెడితే.. పదిహేను రోజులకు ప్యాకింగ్ స్టఫ్ తయారైంది. 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి మష్రూమ్కు సంబంధించిన ఫంగస్‌ను నిర్మూలించారు. తొలుత గ్లాస్‌వేర్ ప్యాకింగ్‌కు వినియోగించే ఎకో ప్యాక్‌ను తయారు చేశారు. ఇది సక్సెస్ కావడంతో ఇతర అన్ని రకాల వస్తువుల ప్యాకింగ్‌కు అవసరమైన మౌల్డ్‌లను తయారు చేసే పని మొదలుపెట్టారు. కేవలం రూ.5 విలువజేసే మష్రూమ్ వ్యర్థాలతో నాలుగైదు డిన్నర్ సెట్లకు ప్యాకింగ్ మెటీరియల్‌ను తయారు చేయవచ్చని వారు చెప్తున్నారు.
పరిశోధనలకు పలు సంస్థల ప్రోత్సాహం
ప్రణవి, అనుపమలు తమ కాలేజీ ‘ఇన్నోవేషన్ కౌన్సిల్’లో వారి ఆలోచనను పంచుకున్నారు. బయోకెమిస్ట్రీ హెచ్‌వోడి శైలజ వీరి ఇన్నోవేషన్‌కు తనవంతుగా ప్రోత్సాహాన్ని అందించారు. ఆమె సూచనల మేరకు వారు వీ-హబ్‌లో తమ ఆవిష్కరణను ఎన్రోల్ చేశారు. పర్యావరణహితంగా మష్రూమ్ వేస్టేజ్‌తో తయారు చేసిన ప్యాకింగ్‌లను వారు వీహబ్‌లో ప్రదర్శించారు.
ఆ తర్వాత యూత్‌ఫర్ సోషల్ ఇంపాక్ట్(వైఎఫ్ఎస్ఐ)కి దరఖాస్తు చేశారు. వీరి ఇన్నోవేషన్‌కు వైఎఫ్ఎస్ఐ ప్రశంసతోపాటు రూ.10 వేల పురస్కారాన్ని అందించింది. అమెరికాకు చెందిన ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ డెవలప్మెంట్ కంపెనీలు వీరి ఇన్నోవేషన్‌పై విస్తృతంగా పరిశోధన చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్విచ్ ఎకో కంపెనీ సైతం ప్రణవి, అనుపమల ఆలోచనను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. వీ హబ్ తమ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కోసం అందించిన సహాయ సహకారాలను మరువలేమని, త్వరలోనే వీ హబ్, టీఎస్ఐసీ, యునిసెఫ్లతో కలిసి తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని ప్రణవి, అనుపమ తెలిపారు.