సంస్థాన్ నారాయణపురం, మే 20 : మందు తాగడానికి వంద రూపాయలు ఇవ్వలేదనే కారణంతో భార్యను చంపిన భర్తకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.37వేల జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా జడ్జి జయరాజ్ మంగళవారం తీర్పు ఇచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామానికి చెందిన పెట్టుగళ్ల ఈశ్వర్‌కు పది సంవత్సరాల క్రితం చౌటుప్పల్ మండలానిని చెందిన సంతోష(28)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈశ్వర్ తాగుడుకు బానిస కావడంతో సంతోష కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. రాత్రి మద్యం సేవించి వచ్చిన ఈశ్వర్ మళ్లీ తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యను అడిగాడు. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో ఉన్న గాలి పంపుతో సంతోష తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమగ్ర విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో పది సంవత్సరాలు జైలు శిక్షతోపాటు జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.