కరీంనగర్ రాంనగర్, జూలై 22: రాష్ట్రంలో సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపీడీని మరువకముందే కరీంనగర్లో మరో భారీ దోపీడీ జరిగింది. తు పాకులు, కత్తులతో ఓ ఇంట్లోకి చొరబడి బెదిరించి.. 54 తులాల బంగారం, 25 లక్షల నగదుతోపాటు 30 తులాల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. నగరం నడిబొడ్డున ఉన్న భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘట న కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు, దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. భగత్‌నగర్‌కు చెందిన అజ్మత్ అలీ తన తాతల కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి వ్యాపారం కోసం వచ్చి స్థిరపడ్డాడు. భగత్‌నగర్‌లో ఓ కాంప్లెక్స్ నిర్మిం చి, ఏడు కుటుంబాలకు అద్దెకు ఇచ్చాడు. మరో పోర్షన్లో అజ్మత్ అలీ కుటుంబం తో కలిసి ఉంటున్నాడు.
మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య ఇంటి ముందు ఉన్న లైట్‌ను ఆఫ్ చేయడానికి అజ్మత్ అలీ బయటకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో మాస్కులు ధరించిన కొంత మంది తుపాకులు, కత్తులతో బెదిరించారు. భార్య, ఇద్దరు కూతుళ్ల సెల్ఫోన్లు లాక్కొని, చున్నీ టవల్‌తో నలుగురిని బంధించారు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి బీరువాలో ఉన్న 54 తులాల బంగా రం, రూ.25 లక్షల నగదుతోపాటు 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. అనంతరం అదే కాంప్లెక్స్ ముందు నిలిపి ఉన్న రెండు బైక్‌లను తీసుకొని పారిపోయారు. హుజూరాబాద్ సమీపంలో బైకులను వదిలేసి వెళ్లినట్టు తెలిసింది. ఈ దోపిడీలో 8 మంది పాల్గొన్న ట్టు పోలీసులు భావిస్తున్నారు. మానేరు జలాశయం లేక్ అవుట్ పోస్టు సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్దకు రెండు బైక్‌లపై ఐదుగురు వ్యక్తులు వచ్చినట్టు గుర్తించారు. బైపాస్ మీదుగా వరంగల్ వైపు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీం పోలీసులు వేలిముద్రలు సేకరించి, డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌టౌన్ సీఐ రాంచందర్‌రావు తెలిపారు.
కుటుంబ సభ్యులపైనే అనుమానం?
దోపిడీలో కుటుంబసభ్యుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నా రు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉంటున్న అజ్మత్ అలీ అల్లుడికి, వీరి కుటుంబానికి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. నెలరోజుల క్రితమే తీసుకున్న చీటీ డబ్బులు బీ రువాలో ఉన్నట్టు దొంగలకు సమాచారం వెళ్లడం వల్లే.. దోపిడీ సులువుగా చేశారన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మీరట్‌లో ఉంటున్న అల్లుడిపైనే అనుమానం ఉందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
మూడు నెలల్లో రెండు ఘటనలు
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో దోపిడీ దొంగల బీభత్సం కొనసాగుతున్నది. మే 3న పీఎంజే జ్యువెల్లరీలో సిబ్బందిపై కాల్పులకు తెగబడి దోపిడీ చేయడం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినా.. అసలు సూత్రధారులు చిక్కలేదు. ఆ రోజు దోచిన 161.4 తులాల బంగారం ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు దొరుకలేదు. తాజాగా అదే తరహాలో భగత్‌నగర్ దోపిడీ కలకలం రేపింది. మూడు నెలల్లో రెండు ఘటనలు జరుగడం కరీంనగర్లో భద్రతను తెరపైకి తెస్తున్నది.