నల్లబెల్లి, ఆగస్టు 12: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీసీసీ బ్యాంకులో భారీ రుణమాఫీ కుంభకోణం బయటపడుతున్నది. పోలీసులు విచారణ చేపట్టి తీగ లాగితే డొంక కదులుతున్నది. మండలంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆధార్ నమోదును తప్పులతడకగా పంపించటంతో అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీనిని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ మిస్‌మ్యాచ్ సమస్యను గుర్తించారు. మండలంలోని ఓ తండావాసులు గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ పుస్తకాలు పోయినట్టు తహసీల్దార్ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టి డూప్లికేట్ పొంది అక్రమంగా రుణాలు తీసుకున్నట్టు తెలిసింది.
అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది, పాలకవర్గం కుమ్మక్కై అధిక రుణం మంజూరుచేసి వారికి పావు వంతు ఇచ్చి మిగతా డబ్బులను సీఈవో నేతృత్వంలో పంచుకున్నట్టు సమాచారం. నందిగామకు చెందిన భూక్యా రాములు రుణమాఫీ మంజూరులో అధికారుల చేతుల్లో మోసపోయానని చెప్తున్నాడు. తనకు గ్రామంలో 10 ఎకరాల భూమి ఉండగా, తనతో పాటు తన భార్య మమత పేరున పీఏసీఎస్ కార్యాలయంలో క్రాప్‌లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా 2021లో రూ.4 లక్షలు రుణం మంజూరు చేశారని చెప్పారు. ఈ రుణాన్ని 2023లో మూడు దఫాలుగా రూ.2.50 లక్షలు సీఈవో ఇచ్చారని, మిగతా రూ.లక్షన్నర పీఏసీఎస్ సార్లే వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన పేరున రూ.5 లక్షలకుపైగా అప్పు ఉన్నట్టు బ్యాంకులో చూపిస్తున్నదని ఆ దంపతులు వాపోయారు.
వీరు ఆదివారం పీఏసీఎస్ అధికారులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన రైతు కొమ్ము రాజు రూ.75 వేలు రుణం తీసుకోగా వడ్డీతో కలిసి రూ.85 వేలు ఉన్నట్టు తెలిపారు. ఈ డబ్బులను 2023లో రెన్యువల్ చేసి 2024లో ఏకంగా రూ.1.96 లక్షల అప్పు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చూపెట్టడంతో అవాక్కైన బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పీఏసీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై ప్రశాంత్‌బాబు విచారణ చేపట్టారు. విచారణలో సంబంధిత సీఈవో అప్రూవర్‌గా మారి బ్యాంకులో జరిగిన అక్రమాలను పోలీసులకు క్షుణ్ణంగా చెప్పటంతో డీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న యోచనతో మండలంలోని అనేక మంది రైతుల పేరున అధికారులు పెద్దమొత్తంలో రుణం మంజూరు చేసి రూ.కోట్లు కాజేసినట్టు బహిర్గతం అవుతున్నది.