హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో డాక్టర్లు ‘సంస్కరణ’ల వైపే మొగ్గుచూపారు. వైద్యరంగంలో సంస్కరణలు కోసం గళం వినిపిస్తున్న ‘హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’ (హెచ్ఆర్డీఏ) ప్యానల్‌కు ఘన విజయం కట్టబెట్టారు. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరుగగా, అన్నింటిని హెచ్చార్డీఏ కైవసం చేసుకుంది. టీఎస్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టులో విడుదలైంది. మొత్తం 96 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
హెచ్చార్డీఏతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సంఘాలు పోటీపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్టర్డ్ వైద్యులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్ అయ్యాయి. అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ మహేశ్‌కుమార్ 6,735 ఓట్లు సాధించారు. 13 స్థానాలను హెచ్చార్డీఏనే గెలుచుకున్న నేపథ్యంలో చైర్మన్ పదవి సంఘానికే దక్కుతుందని భావిస్తున్నారు.