Free Bus For Women | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఉత్పన్నమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ అద్దెబస్సుల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. తమ ప్రధాన సమస్యలను జనవరి 5లోపు పరిష్కరించాలని, లేదంటే అదే రోజు నుంచి బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,700 ఆర్టీసీ అద్దె బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో వెయ్యి ఎక్స్‌ప్రెస్‌లు, 700 పల్లె వెలుగు బస్సులు, మిగిలిన వెయ్యి సిటీ బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. ఫలితంగా బస్సుల్లో ఓవర్‌లోడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ చెల్లించే ధరలు గిట్టుబాటుకావడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ సమయంలో విధించిన నిబంధనలు తలనొప్పిగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు. బస్సు యజమానులే నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిబంధనను సడలించాలని హైర్బస్ యజమానులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా కేఎంపీఎల్ బాగా తగ్గిపోయిందని, మైలేజీ 4.8 కిలోమీటర్లకు పడిపోతున్నదని చెప్తున్నారు. కాబట్టి కేఎంపీఎల్‌ను 4.5 కిలోమీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లీజ్ కింద ఒక్కో బస్సుకు ప్రభుత్వం డీజిల్ పోసి నెలకు రూ.80-90 వేల అద్దె చెల్లిస్తున్నదని, ఇందులో డ్రైవర్ జీతం పోగా రూ.60 వేలు ఈఎంఐలకు పోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలపై అన్ని రీజియన్లలో సమావేశాలు నిర్వహించి, తుది నిర్ణయానికి వచ్చినట్టు ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. జనవరి 5లోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు.