హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఆయనకు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులంతా హాజరయ్యారు. జస్టిస్ సాంబశివరావు నాయుడు అందించిన న్యాయ సేవలను సీజే కొనియాడారు.
ఆయన విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. జస్టిస్ సాంబశివరావు నాయుడు కుటుంబసభ్యులతోపాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ సాంబశివరావు నాయుడు, సూర్యవాణి దంపతులను హైకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అసోసియేషన్ చైర్మన్ అయ్యపు రవీందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ శ్యాం కోసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ సాంబశివరావు నాయుడు పదవీ విరమణతో ప్రస్తుతం హైకోర్టులో సీజేతో కలిపి 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.