కరీంనగర్ కోర్టుచౌరస్తా, నవంబర్ 10: కోర్టుల్లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నదని, వాటిని త్వరితగతిన పరిషరించి పెండెన్సీ తగ్గించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన భవనాల సముదాయానికి, సీతారాంపూర్ రోడ్డులో న్యాయమూర్తుల 20 నూతన నివాస భవన నిర్మాణాలకు ఇతర హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి బీ ప్రతిమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని, ఈ జిల్లాలో నూతన భవనాల శంకుస్థాపన గావించడం సంతోషకరమని పేర్కొన్నారు. జ్యుడీషియరీలో ఆధునిక టెక్నాలజీని అందరూ ఉపయోగించుకున్నప్పుడే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఫ్యామిలీ, సివిల్ కేసుల పరిషారానికి మధ్యవర్తిత్వాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు. నల్గొండ జిల్లా హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్ర, గుర్తింపు, ఆలయాల చరిత్ర, పంటలు, జిల్లా నుంచి గుర్తింపు తెచ్చుకున్న వారి వివరాలను తెలిపి అందరినీ ఆశ్చర్యపర్చారు.
అనంతరం హైకోర్టు పూర్వపు జడ్జి జస్టిస్ పీ నవీన్‌రావును సన్మానించారు. వృత్తిలో 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పీ గోపాలకృష్ణ, కే మాధవరావు, జీ నారాయణరెడ్డి, వీ వెంకటేశ్వరరావు, జీ హనుమంతరావును చీఫ్ జస్టిస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ బీ వినోద్‌కుమార్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమా ర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ జై శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీపీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.