హైదరాబాద్, ఫిబ్రవరి 18, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి వేడుకల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా వేడుకలు నిర్వహించాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు పలు షరతులు కూడా విధించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే నిర్వాహకులపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని స్పష్టంచేసింది. జయంతి వేడుకకు అమనుతి కోరుతూ ఈ నెల 17న పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదంటూ గోలొండలోని వీర్ శివాజీ సేన, బీజేవైఎం అధ్యక్షుడు నితిన్ నందర్ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈనెల 19న సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో 150 మందితో వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జాంబాగ్ ట్రూప్‌బజార్‌లోని హనుమాన్ మందిర్ ఎదురుగా ఉన్న సుందర్భవన్ నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.