హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, అల్విన్‌కాలనీ, మియాపూర్, హైదర్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, గాజులరామారం, మేడ్చల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 గంటల్లో సరాసరి 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మియాపూర్‌లో అత్యధికంగా 20.6 సెంటీమీటర్లు, హైదర్‌నగర్‌లో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే ముందస్తు సహాయక చర్యలను పర్యవేక్షించిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రధాన మార్గాల్లో నీటిని తొలగించి రవాణాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రగతినగర్‌లోని బాచుపల్లి నాలాలో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు మిథున్ పడి మృతి చెందారు. బాచుపల్లి నాలా కలిసే ప్రగతినగర్ తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశాయి. వచ్చే ఐదు రోజులపాటు నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎగువన కురుస్తున్న భారీ వానలకు నగర జంట జలాశయాల వద్ద ఆరు గేట్లను వాటర్‌బోర్డు అధికారులు ఎత్తివేశారు. ఆరు గేట్ల నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
36 గంటల్లో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
ప్రాంతం వర్షపాతం
మియాపూర్ 206.8
హైదర్‌నగర్ 191.3
శివరాంపల్లి 175.8
ఈఎస్ఎస్
గాజుల రామారాం 168.8
బోరబండ 160.3
ఈఎస్ఎస్ జీడిమెట్ల 156.5
షాపూర్‌నగర్ 152.5
కూకట్పల్లి
బాలాజీనగర్ 157.6
బంజారాహిల్స్ 150
కుత్బుల్లాపూర్ 154.0
మాదాపూర్ 144.5
షేక్‌పేట 145.6
వెస్ట్ మారేడ్‌పల్లి 124.6
రాజేంద్రనగర్ 142
ఖైరతాబాద్ సెస్ 136.3
అడ్డగుట్ట 122.8
కూకట్పల్లి
వివేకానందనగర్ 139.6
మోండామార్కెట్ 121.0
గచ్చిబౌలి 145.3