రామచంద్రాపురం, జూలై18: మాయమాటలే పెట్టుబడిగా పెండ్లిళ్లు చేసుకొంటాడు.. కట్నకానుకలు చేతికి అందడమే లేటు.. మరో వివాహానికి రెడీ అయిపోతాడు. అలా మొత్తం 13 పెండ్లిళ్లు చేసుకొన్న ఓ ప్రబుద్ధుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో అతడిపై కేసు నమోదైన విష యం తెలుసుకొని మరికొందరు బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని వేటపురికి చెందిన అడప శివశంకర్‌బాబు (40) నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే ఆర్సీపురానికి చెందిన ఓ యువతిని గత డిసెంబర్లో పెండ్లి చేసుకొన్నాడు.
కొద్దిరోజులకే అదనపు కట్నంకోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లింది. అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీసింది. అప్పటికే అతడికి చాలా మందితో వివాహం జరిగిందని తెలుసుకొని ఈ నెల 13న ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న మరికొందరు బాధితురాళ్లు సోమవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే 12 మంది జీవితాలను నాశనం చేసి ప్రస్తుతం గుంటూరులో 13వ పెండ్లి చేసుకొని ఉంటున్నాడని.. తక్షణమే అతడిని అరెస్టు చేసి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు.