హైదరాబాద్ : అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక బీఆర్ఎస్ అన్నారు. పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక, తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.
పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం.. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్.. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది జనంలో మార్మోగుతోందని స్పష్టం చేశారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేవని హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.