హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆనంద కన్వెన్షన్‌లో తనకు వాటాలున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గోలొండకోట, చార్మినార్‌లోనూ హరీశ్‌కు వాటాలున్నాయని అంటారేమోనని అసహనం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసిన అనిల్‌కుమార్ యాదవ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, నిరాధారమైన ఆ వ్యాఖ్యలను సామాజిక మాధ్యం ఎక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీస్ పంపించారు. అనిల్‌కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో హరీశ్‌రావుకు వాటాలున్నాయంటూ ఎక్స్ వేదికగా ఎంపీ అనిల్ ఆరోపించారు. అక్రమ ఆస్తులను కాపాడుకొనేందుకు సామాన్యులను అడ్డుపెట్టుకుంటున్నారంటూ మరో వ్యాఖ్యను జోడించారు. దీనిపై హరీశ్‌రావు లీగల్ నోటీస్ ద్వారా స్పందించారు.
కాంగ్రెస్ నేతలు పిచ్చివేషాలు మానుకోవాలి : కార్తీక్‌రెడ్డి
ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పీ కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనంద కన్వెన్షన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు భాగస్వామి అని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టులను ఆయన తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ వ్యక్తిగత దాడుల్లో భాగమేనని విమర్శించారు. ఆనంద కన్వెన్షన్‌తో హరీశ్‌రావుకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఆనంద కన్వెన్షన్‌ను కూలగొడితే అకడ జేసీబీకి ముందు కొబ్బరికాయ కొట్టేది తామేనని తెలిపారు. కాంగ్రెస్ నేతలు పిచ్చివేషాలు మానుకోవాలని హితవు పలికారు. హైడ్రాపై హైకోర్టు అక్షింతలు వేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు.
ఎంపీ అనిల్వి పిల్లచేష్టలు: దాసోజు శ్రవణ్
పార్లమెంట్ సభ్యుడు అయినా అనిల్‌కుమార్‌కు ఇంకా పిల్లాడి చేష్టలు పోలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.