హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కొండమల్లు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సామాజిక జీవన విధానాల నేపథ్యంలో నవల రాయడం గొప్ప విషయమని తెలిపారు. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన మూడు పుస్తకాలను తానే ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కొండమల్లు పుస్తకం ద్వారా చెంచుల చరిత్ర, వారి సంస్కృతి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాశారని కొనియాడారు.
వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకావిష్కరణ కూడా తన చేతుల మీదుగానే జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు చెంచుల భూములపై హక్కులు కల్పించేలా సహకరించాలని కోరగా అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో ఆ ప్రాంతాంనికి చెందిన 1600 ఎకరాల చెంచుల భూములకు పోడు పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. వెంకటేశ్వర్లు తన పుస్తకాలతో చెంచుల అస్తిత్వాన్ని కాపాడేందుకు తన వంతు సహాయం, కృషి చేస్తున్నారని అభినందించారు.
వెంకటేశ్వర్లు మరో పుస్తకం ‘పిట్ట వాలిన చెట్టు’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతిబింబించేలా ఉందని పేర్కొన్నారు. కొండమల్లు పుస్తకానికి ముందుమాట రాసిన అట్టాడ అప్పలనాయుడు వ్యాఖ్యలు తనకు చాలా బాగా నచ్చాయని హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరీశంకర్, సీనియర్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల జీవితాన్ని పుసక్తాల్లో పొందుపరచడం అంటే మామూలు విషయం కాదు. ఒక నవలలో ఎలాంటి విసుగు, వివాదానికి తావివ్వకుండా చెంచు జాతికి చెందిన వ్యక్తిని హీరోను చేయడం సాధారణ విషయం కాదు. ఎలాంటి కల్మషం లేనివారు చెంచులు. వారి బతుకులు అంతరించిపోకుండా ప్రపంచానికి తెలియజేసేలా వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి అత్యంత అభినందనీయం. ఆదివాసీలను వారి బతుకులు వారిని బతకనిద్దాం. అడవిలో బతుకుతున్న నిజమైన ఆధ్యాత్మికతత్వం కలిగిన వారు చెంచులు. అలాంటి వారి అస్తిత్వాన్ని కాపాడేందుకు వర్ధెల్లి వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి విశేషమైనది.
-గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ
కొండమల్లు పుస్తకానికి ముందుమాట రాయడం నా అదృష్టం. ఏదైనా పుస్తకానికి ముందుమాట రాయాలంటే కొంత వరకు చదివితే సరిపోతుంది. కానీ ఈ పుస్తకం పూర్తిగా చదివేలా వెంకటేశ్వర్లు కథలో లీనమై రచించారు. ఈ నవల ప్రస్తుత రాయలసీమ ప్రజల జీవన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంది. త్వరలోనే వర్ధెల్లి వెంకటేశ్వర్లు నుంచి కాకతీయుల చరిత్రకు సంబంధించిన నవల రాబోతున్నది. ప్రస్తుతమున్న రచయితల్లో అలాంటి కథలకు ప్రాణం పోయగలిగే సమర్థుడు వెంకటేశ్వర్లు ఒక్కరే.
-బండి నారాయణస్వామి, ప్రముఖ రచయిత
కొండమల్లు వంటి పుస్తకాన్ని రాయడం వల్ల వర్ధెల్లి వెంకటేశ్వర్లుపై నాకు గౌరవం పెరిగింది. పుస్తక రచనలో ఆయన ఎంచుకున్న పద్ధతి నాకు బాగా నచ్చింది. చరిత్రకారులు తమకు నచ్చిన వాటినే చరిత్రలో పొందుపరిచారు. కానీ ఈ పుస్తకంతో కొత్త చరిత్ర బయటకు వస్తుందని భావిస్తున్న. ప్రస్తుత రచయితలు కనుమరుగైన చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-ఘంటా చక్రపాణి, వీసీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
తెలుగు సాహిత్యానికి వర్ధెల్లి వెంకటేశ్వర్లు రూపంలో కొత్త నవలాకారుడు వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి నవలాకారుల కొరత ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరిందని భావిస్తున్న. సంక్లిష్టమైన విషయాన్ని సరళరూపంలో నవలగా రాయడం చాలా గొప్పవిషయం. అందులో వర్ధెల్లి వెంకటేశ్వర్లు సఫలీకృతులయ్యారు. ఆంధ్రా ప్రాంత చరిత్రను తెలంగాణ మాండలికంలో రాసిన గొప్ప రచయిత వెంకటేశ్వర్లు.
-కే శ్రీనివాస్, సీనియర్ ఎడిటర్
చెంచుల బతుకులను ప్రపంచానికి తెలియజేయడంలో వర్ధెల్లి వెంకటేశ్వర్లు గొప్పమనసు చాటుకున్నారు. కొండమల్లు పుస్తకంతో ఆయన 12వ శతాబ్దంలోకి వెళ్లి, అందులో లీనమైపోయారు. ఆదివాసీల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వర్ధెల్లి వెంకటేశ్వర్లు కృషి చేయడం గొప్ప పరిణామం.
– అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
ఈ పుస్తకంలో 12వ శతాబ్దం నాటి చెంచుల జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, పోరాట పటిమ, ధైర్య సాహసాలను కండ్లకు కట్టినట్టు దృశ్య కావ్యంలా రూపొందించారు. అడవి పరిమళాల స్వచ్ఛదనాన్ని తెలియజెప్పారు. కారు కోడిని వేటాడే క్రమంలో బయ్యన్న అనే చెంచు వ్యక్తి తన పూర్వ జీవనం, ప్రస్తుత విషయాల మేళవింపుతో నవలకు పూర్తి న్యాయం చేశారు.
– అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ రచయిత