హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ):ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకొని బుధవారం నుంచే తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, గోపూజా, మొక్కలు నాటడం ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. పలువురు నాయకులు అన్నదానం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కేసీఆర్ అభిమానులు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి గ్రీటింగ్స్ తెలిపారు. కారణజన్ముడు కేసీఆర్‌కు శుభాకాంక్షలు, యుగానికొక్కడికి హ్యాపీ బర్త్‌డే విషెస్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో బుధవారం కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిచ్చాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారణాసిలోని ప్రధాన కూడళ్లలో భారీ గ్రీటింగ్స్, హోర్డింగ్స్ నెలకొల్పి శుభాకాంక్షలు తెలిపారు. వారణాసిలోని కేసీఆర్ హోర్డింగ్‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. శుభాకాంక్షలను తెలిపే ఎల్ఈడీ స్క్రీన్లను ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అధ్యక్షప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణలు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణను పచ్చదనంతో నింపి సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా అందించాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కోరారు. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో బుధవారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కోలేటి దామోదర్, శాంతిభద్రతలు, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్నారు.