అచ్చంపేటటౌన్, మే 15 : దాడులకు ప్రతి దాడులు చేసే సంస్కృతి తమది కాదని, దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్(BRS) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు(Guvvala Balaraju )పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో (RS Praveen Kumar) కలిసి బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో(Atchampeta) విలేకరులతో మాట్లాడారు.
పోలింగ్ మరుసటి రోజు కాంగ్రెస్(Congress party) నేతలు గూండాల్లా వ్యవహరించి బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మలబాలరాజు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్రమ సంపాదనకు మరిగి దాడులకు ప్రేరేపిస్తున్నాడని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు. తమ హయాంలో మైనింగ్ మాఫియాను అడ్డుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు.
వ్యాపారులపై ఒత్తిడి పెంచి వసూళ్లకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులను స్థానిక ఎమ్మెల్యే వెనకేసుకొస్తున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దాడులను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉందన్నారు. పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించడం హృదయాన్ని కలిచివేసిందన్నారు. దాడిచేసిన వారిని పట్టుకోకుండా పరారీలో ఉన్నారని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు.
వంగూర్‌లో మైనర్లు ఓటేస్తున్నారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడు కోట్ల నరేందర్రావుపై రంగారావు, సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు ఎనుమల చింతలరెడ్డి ఆదేశాల మేరకు దాడులకు పాల్పడడం అమాను షమన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు సుంకరి నిర్మలబాలరాజు, శంకర్, న్నుపటేల్, రమేశ్‌రావు, కుతుబుద్దీన్, జెడ్పీటీసీ రాంబాబు పాల్గొన్నారు.