హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లను ట్రిబ్ సైట్లో పొందుపర్చినట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఇటీవలే డీఎల్, జేఎల్ పోస్టులకు 1:2 పద్ధతిలో మెరిట్ జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. డెమోలను నిర్వహించడంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తిచేసింది. ఇందుకు సంబంధించి తాజాగా డీఎల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా 642 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. జేఎల్ పోస్టులకు, దివ్యాంగులకు కేటాయించిన పోస్టులకు సంబంధించిన జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది.