పటాన్చెరు, జూలై 20 : గన్ మిస్‌ఫైర్ అయి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బీడీఎల్ పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్చెరు మండలం భానూర్ పరిధిలోని బీడీఎల్ పరిశ్రమ బందోబస్తు బాధ్యతలను సీఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్నది. టౌన్షిప్లో నివసిస్తున్న పెట్నికోట వెంకటేశ్వర్లు(32) సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. బీడీఎల్లోని వాచ్‌టవర్ నంబర్-4లో వెంకటేశ్వర్లు రాత్రి డ్యూటీ చేశాడు. తెల్లవారుజామున డ్యూటీ ముగించుకుని యూనిట్ లైన్ బ్యారక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న గన్ ప్రమాదవశాత్తు పేలడంతో బుల్లెట్ నేరుగా వెంకటేశ్వర్లు తలలో నుంచి బయటకు వెళ్లింది. వెంకటేశ్వర్లును చికిత్స కోసం టౌన్‌షిప్‌లోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు 2012లో సీఐఎస్ఎఫ్లో చేరాడు. ఇతను ఏడాదిన్నరగా బీడీఎల్ భానూర్ యూనిట్ రక్షణ విధులు నిర్వహిస్తున్నాడు.
దవాఖానలో బాలుడి కిడ్నాప్
వినాయక నగర్, జూలై 20: నిజామాబాద్‌లోని జీజీహెచ్‌లో తండ్రి ప క్కన నిద్రిస్తున్న మూడేండ్ల బాలుడిని ఆగంతకులు తెల్లవారుజామున అపహరించుకుపోయారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్బండారుకు చెందిన సాయినాథ్ భార్య గర్భిణి. ప్రసవం కోసం ఆమెను ప్రభు త్వ దవాఖానలో చేర్పించారు. సాయినాథ్ తన మూడేండ్ల కుమారుడు అరుణ్‌తో కలిసి శుక్రవారం రాత్రి దవాఖాన కారిడార్‌లో నిద్రించాడు. శనివా రం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న అరుణ్‌ని ఎత్తుకెళ్లారు. ఉదయం సాయినాథ్ లేచి చూడగా కొడుకు కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా, సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఆగంతకులు బాబును భుజాన వేసుకుని వెళ్తున్నట్టు గుర్తించా రు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు నేతృత్వంలోని బృందం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించింది. సాంకేతికత ఆధారంగా బాలుడిని మెట్‌పల్లికి తీసుకెళ్లినట్టు తేలడంతో ప్రత్యేక బృందం హుటాహుటిన అక్కడికెళ్లి బాలుడిని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.
మహిళా కూలీకి మద్యం తాగించి లైంగికదాడి
అచ్చంపేట రూరల్, జూలై 20: మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారికి మద్యం తాగించి లైంగికదాడి చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సోనీ గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ వ్యాపారులు, రాజస్థాన్‌కు చెందిన యువకులు గోవింద్‌సింగ్, గజానంద్సింగ్ అదే పట్టణంలో అద్దెకు ఉంటున్నారు. 18న తమ ఇంట్లో పని ఉందని బ ల్మూరు మండలంలోని రెండు వేర్వేరు గ్రా మాలకు చెందిన ఇద్దరు మహిళలను కూలికి మాట్లాడుకున్నారు. వారిని ఇంటికి తీసుకెళ్లి పనులు చేయించుకొని డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి పంపించకుండా దావత్ ఇస్తామని ఆశ పెట్టారు. మాయమాటలు చెప్పి హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి స మీపంలోకి తీసుకెళ్లి మద్యం తాగించారు. వారు మత్తులోకి జారుకున్నాక గోవింద్, గజానంద్ లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం వెల్టూరు గేటు వద్ద ఒకరిని, పట్టణంలోని డీఎఫ్‌వో కార్యాలయం సమీపంలో మరొకరిని రాత్రి కారులోంచి దించి పరారయ్యారు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా.. వారు పోలీసులకు తెలిపారు. ఇద్దరు మహిళలను అచ్చంపేట దవాఖానకు తరలించారు. మతిస్థిమితం వచ్చాక వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.