హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎజెండా ప్రకారం ప్రతి నెలా పాలకవర్గాల సమావేశాలు నిర్వహించి వాటిని వీడియో తీయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది కాకుండా పాలకవర్గ సభ్యుల్లో 50% మంది ఎప్పుడు కోరితే అప్పుడు సమావేశాలను నిర్వహించాలని, ఇందుకు తప్పనిసరిగా కోరం ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలను జారీచేశారు. కౌన్సిల్ భేటీ ముగిసిన తర్వాత అవసరమనుకుంటే చైర్మన్, లేదా వారు సూచించిన వ్యక్తి సమావేశ వివరాలను మీడియా ద్వారా వెల్లడించవచ్చని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశ మినిట్స్ బాధ్యత మున్సిపల్ కమిషనర్‌దేనని, సమావేశం నిర్వహించిన మూడు రోజుల్లో కలెక్టర్‌కు, అదనపు కలెక్టర్‌కు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌కు అందించాలని సూచించారు.