హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): టీచర్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) కోరింది. గురువారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని హైదరాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాలయంలో జీటీఏ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఎంఈవో, డీవైఈవో, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్‌కు పదోన్నతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసినవారిలో జీటీఏ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు కే దశరథ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వీ రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డీ గిరివర్ధన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్ నర్సింహారావు, బీ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.
టీచర్ల బదిలీలు,పదోన్నతులు చేపట్టాలి
టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని టీచర్స్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఏజేఏసీ) గురువారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేసింది. పదోన్నతులను సాధారణ పద్ధతిన, బదిలీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేపట్టాలని విన్నవించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీఏజేఏసీ చైర్మన్ మణిపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మల్లారెడ్డి, నాయకులు లచ్చి రాం, నరసింహస్వామి, రఘునందన్‌రెడ్డి, జగదీశ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.