Groom | చేర్యాల, మార్చి 8 : మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఓ యువతికి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఈ నెల 9న చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో యువతి పెళ్లి చేసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
పెళ్లిపత్రికలు సైతం పంచడంతో పాటు షాపింగ్ తదితర పనులు పూర్తి చేశారు. పెళ్లి ఏర్పాట్లు అన్ని పెళ్లి కొడుకు తెలిసే జరిగినప్పటికి సదరు యువకుడు ఈ నెల 7న బచ్చన్నపేట మండలానికి చెందిన మరో యువతితో వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న చిట్యాల గ్రామానికి చెందిన యువతి బంధువులు గ్రామస్తులతో కలిసి చేర్యాల పోలీసులను శనివారం ఆశ్రయించారు. పెళ్లి జరిగే ముందు రోజున పెళ్లి కుమారుడు మరో అమ్మాయితో లేచిపోవడంతో పెళ్లి నిశ్చయమైన యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు.