ఆదిభట్ల, జూన్ 3: ‘గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటుతో భూములు పూర్తిగా పోతున్నాయని, రోడ్డు ప్లాన్ మార్చాలని’ 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న భూబాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్‌పై రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు ఫేజ్-1 రోడ్డును 18.5 కిలోమీటర్ల పొడువులో ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ, పరిహారం, పునరావాసం, ఉపాధి కల్పనకోసం కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ గ్రామాల రైతులతో రెండోదఫా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రైతులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూ సేకరణ అధికారి రాజుతో తమ వాదనను తెలిపారు. భూసేకరణ అధికారి మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఉద్యోగం, రూ.5 లక్షల 50 వేలు చెల్లించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటు లో కొంగరకలాన్, ఫిరోజ్‌గూడకు చెందిన 30మంది రైతుల భూములు కోల్పోతున్నారు. కానీ ప్రజా అభిప్రాయ సేకరణలో ఏడుమంది రైతులే పాల్గొన్నారు.