హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : గ్రామ పాలనాధికారుల (జీపీవో) ఎంపికకు ఈనెల 25న పరీక్షలు నిర్వహించగా, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 3550మంది ఎంపికైనట్టు వెల్లడించింది. ఈ మేరకు ర్యాంకులవారీగా ఎంపికైన వారి వివరాలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ వెల్లడించారు. మొత్తం 4588మంది పరీక్షలు రాయగా, వీరిలో 3550మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 272, నిజామాబాద్ నుంచి 231మంది, హైదరాబాద్ నుంచి 33మంది ఎంపికైనట్టు తెలిపారు. అలాగే వరంగల్ నుంచి 170మంది, కరీంనగర్ నుంచి 163మంది క్వాలిఫై అయినట్టు వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామపరిపాలన అధికారుల (జీపీవో) ఫలితాలు ప్రకటించడంపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని సంఘం ప్రతినిధులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.