15 వేలు లంచం తీసుకొంటూ దొరికిన మణికంఠ
జూలూరుపాడు, మార్చి 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు క్లస్టర్ ఏఈవో లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారపాడుకు చెందిన మహిళా రైతు బానోతు కాళి గత నెల 17న అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె కుమారుడు కల్యాణ్.. రైతుబీమా కోసం వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. బీమా మంజూరుకు పాపకొల్లు ఏఈవో బెజవాడ మణికంఠ రూ.30 వేలు డిమాండ్ చేసి.. చివరకు రూ.20 వేలకు అంగీకరించాడు. బుధవారం పాపకొల్లు రైతువేదికలో ఏఈవో మణికంఠ.. కల్యాణ్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకొంటుండ గా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. అదే సమయంలో ఏఈవోకు సంబంధించి సుజాతనగర్‌లోని అద్దె ఇల్లు, అశ్వారావుపేటలోని సొంత ఇంట్లో సోదాలు నిర్వహించారు.