Telangana Teachers | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల రద్దుపై ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. ఉన్నపళంగా సెలవులు రద్దుచేయడంపై మండిపడుతున్నారు. శిక్షణ పేరుతో సెలవులనే రద్దుచేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. మే నెలలో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ఈ శిక్షణ నేపథ్యంలో అనుమతిలేనిదే ఉపాధ్యాయులు సెలవులు తీసుకోవద్దని, హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లవద్దని వివిధ జిల్లాల డీఈవోలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వారం రోజుల శిక్షణ కోసం ఎందుకింద హడావుడి అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో తాము తాము శిక్షణ పొందలేదా? శిక్షణ పేరుతో వేరే అంశాలను తమపై రుద్దలేదా? అని ఓ ఉపాధ్యాయుడు అభిప్రాయపడుతున్నారు. శిక్షణ పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఏకంగా ఫోన్లు చేసి నిలదీస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఈ సమావేశం జరగనున్నది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రతి సంఘం, అసొసియేషన్ నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున ఈ సమావేశానికి పిలిచింది.
ఈ సమావేశంలో సెలవుల రద్దు అంశాన్ని ప్రస్తావించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు భావిస్తున్నారు. బుధవారం పాఠశాలల చివరి పనిదినం కావడంతో తప్పనిసరిగా టీచర్లు విధుల్లో ఉండాల్సిందే. ఇటు బడిలో ఉండాలని చెప్పి, మరోవైపు సమావేశానికి పిలవడంపై ఓ ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.