హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వారి నుంచి గత ఎనిమిదేండ్లలో 1,234 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకొన్నామని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రజా అవసరాల కోసమే ప్రభుత్వ భూములను వినియోగిస్తున్నామని స్పష్టంచేశారు. మంగళవారం ఆయన శాసనసభలో పలు సవరణ బిల్లులపై నిర్వహించిన చర్చలో మాట్లాడుతూ.. ఉపాధి కల్పన, రాష్ర్టానికి ఆదాయం వచ్చే విధంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని వివరించారు. హిందూజా భూముల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నామని, ఇందులో తమ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కింద 136.4 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించి, లీజుకు ఇచ్చిందని తెలిపారు. అయితే, లీజు గడువు ముగిసిపోయిందని, అక్కడ పరిశ్రమలు కొనసాగించాలనుకొనే వారికి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం భూములు కేటాస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ‘క్యాతన్‌పల్లి’ మున్సిపాలిటీ పేరును ‘రామకృష్ణాపూర్’ మున్సిపాలిటీగా పేరు మారుస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నామని, సమీప గ్రామాలైన బండారుపల్లి, జీవంతరావు పల్లెలను ఇందులో విలీనం చేస్తామని చెప్పారు.
మా అక్క అడగకపోయినా… అన్నీ ఇచ్చాం
కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. అలాంటిది మా అక్క అడగకపపోయినా ములుగు జిల్లా, మెడికల్ కాలేజీ ఇచ్చినం. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ చేసినం. మున్సిపాలిటీ ఏర్పాటు చేసినం. కేంద్రం మాదిరిగా కాకుండా స్వపక్షం, విపక్షం అనే వివక్ష లేకుండా నాలుగు కోట్ల ప్రజలను సమదృష్టితో చూస్తున్నాం’ అని వివరించారు.
మొత్తంగా ఎనిమిది బిల్లులను ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. వాటిలో కొన్ని
47వ జీఎస్టీ కౌన్సిల్లో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని సవరించారు.
రాష్ట్రంలో మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ మేరకు కొత్తగా 1.ఎన్‌ఐసీఎంఏఆర్ నిర్మాణ అధ్యయనాల వర్సిటీ (మేడ్చల్ మల్కాజిగిరి), 2.ఎంఎన్ఆర్ వర్సిటీ (సంగారెడ్డి), 3.గురునానక్ వర్సిటీ (రంగారెడ్డి), 4. శ్రీనిధి వర్సిటీ (మేడ్చల్-మల్కాజిగిరి), 5.కావేరి వర్సిటీ (సిద్దిపేట) ఏర్పాటుకానున్నాయి.
5. వైద్య విశ్వవిద్యాలయం మినహాయించి తెలంగాణ యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ప్రత్యక్ష నియామకాలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు.
వైద్యశాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏండ్లుగా ఉన్నది. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యవిద్య డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ల పదవీ విరమణ వయసు 61 ఏండ్లు. దీనిని 65 సంవత్సరాలకు పెంచుతూ చట్టానికి సవరణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణకు అర్హత కలిగిన అటవీ వృత్తి నిపుణులను తయారు చేయడం కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.
మోటర్ వాహనాల పన్నుల విషయంలో వాహనం ఖరీదు ప్రకారం ఎక్సైజ్ డ్యూటీ విధించేలా చట్టానికి సవరణ చేశారు.