శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 17:15:05

చిరు వ్యాపారులకు..ప్రభుత్వం ఆర్థిక భరోసా : మంత్రి హరీశ్ రావు

చిరు వ్యాపారులకు..ప్రభుత్వం ఆర్థిక భరోసా : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : కరోనా క్లిష్ట సమయంలో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు  ప్రభుత్వం రుణాలను అందజేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. చిరు వ్యాపారులు  ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని  మంత్రి  సూచించారు. జిల్లాలోని గజ్వేల్ ఐవోసీలో పట్టణంలోని 853 మంది పట్టణ చిరు, వీధి వ్యాపారులకు రూ. 85 లక్షల విలువైన రుణాలను మంత్రి  హరీశ్ రావు పంపిణీ చేశారు. అలాగే  స్వయం సహాయక బృందాల సభ్యులకు స్త్రీ నిధి కింద రూ. 2 లక్షల 26 వేల 652 వేలు, 8 కొత్త  మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద 80 వేల రూపాయల చెక్కులను అందజేశారు .

ఈ సందర్భంగా మంత్రి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట సమయంలో చిరు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఫలితంగా వాటి పై ఆధారపడ్డ వీధి వ్యాపారాలు ఆర్థికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చేతిలో చిల్లి గవ్వ లేక ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని జీవనం కొనాగిస్తున్నారని పేర్కొన్నారు.  వ్యాపార కూడలి గా ఉన్న గజ్వేల్ లాంటి  పట్టణంలో చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి దుస్థితి ని గుర్తించి ప్రభుత్వం కరోనా కాలంలో అండగా ఉండేందుకు పట్టణంలో చిరువ్యాపారంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు . 

 చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిగతులను చక్కబెట్టేందుకు స్వల్పకాలిక రుణాలు ప్రతి చిరు వ్యాపారికి ఎలాంటి పూచికత్తు లేకుండా  రూ.10వేల చొప్పున మంజూరు చేస్తుందన్నారు. ఈ రుణాలను ఏడాది లోపు 7 శాతం వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు . వీధి వ్యాపారులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాలను తిరిగి ప్రారంభించి వృద్ది చేసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో  క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ లావాదేవీలకు చిరు వ్యాపారులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఒక రోజు ప్రతి వ్యాపారి 200 డిజిటల్ లావాదేవీలు  చేస్తే ప్రభుత్వం 100 నగదు ప్రోత్సాహకం అందజేస్తుంద్ననారు . మరోసారి   గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని   అర్హులైన ప్రతి  చిరు వ్యాపారికి  రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు వీలుగా మెప్మా అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టాలన్నారు. మహిళలు  ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు.  కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
logo