హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ): అంకితభావమే ప్రతి ఉద్యోగికీ కీలకమని, పట్టుదల తోడైతే ఆ ఉద్యోగి తన విధుల్లో విజయం సాధించి తీరుతారని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నాగోల్లో ఆదివారం జరిగిన తెలంగాణా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ వర్క్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వా రవీందర్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
గవ్వా రవీందర్రెడ్డి 43 సంవత్సరాల పాటు గృహనిర్మాణ శాఖలో విజయవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఉద్యోగుల హకులకోసం పోరాడి సర్వీస్ రెగ్యులర్ చేయించారని తెలిపారు. ప్రమోషన్లు, పీఆర్సీ, ఐఆర్, డీఏ అమలు చేయించడంలో సఫలమయ్యారని చెప్పారు. అసోసియేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బొగ్గుల వెంకటరామిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సన్మానసభలో హౌసింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈశ్వరయ్య, రవీందర్రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాలకృష్ణారెడ్డి, దాశరథిశర్మ, రాందేవ్రెడ్డి, భాసర్రెడ్డి, రఘువీర్, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొని ఘనంగా సతరించారు.