హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపకల్పనలో మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. 95శాతం మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను విసృ్తతంగా పెంచేందుకు సమగ్రమైన వ్యూహం రచిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజాభవన్లో మంత్రి సీతక మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డాక్యుమెంట్ రూపకల్పనలో మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధి, సంరక్షణ, పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు 52.7శాతంగా ఉన్నదని, దానిని 2047 నాటికి 95శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతీ ఓజా, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.