న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులెత్తేశారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని పరోక్షంగా తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోజ్‌గార్ మేళాను శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిరుద్యోగం అనేది వందేండ్ల సమస్య.. దానిని వంద రోజుల్లో పరిష్కరించలేం. ప్రతిపక్షాలకు ప్రతి ఎన్నికల్లో నిరుద్యోగమే ఎజెండా అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడటమే ముఖ్యం’ అని పేర్కొన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతిచ్చి కోటిన్నర ఉద్యోగాలు కాపాడామని, అంతకంటే ఏం చేయగలమని అన్నారు. గత పదేండ్లలో దేశ ప్రజలకు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఇవ్వని హామీ లేదు. అరచేతిలోనే స్వర్గం చూపిస్తూ కోట్ల మంది ప్రజలను ఉద్వేగపు మత్తులో ఉంచారు. 2013లో మొదటిసారి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని మోదీ గంభీరమైన హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి బీజేపీ గెలువగానే మేం అలా అననేలేదు అని మాట మార్చారు. నిజానికి నాటి బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వచ్చే పదేండ్లలో.. అంటే 2024 నాటికి ఏకంగా 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఎనిమిది ఏండ్లు గడిచినా ఇప్పటికీ 25 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టించలేదని అధికారిక గణాంకాలే చెప్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేంద్రంలో 9 లక్షల కొలువులు ఖాళీ
ఉద్యోగాలు ఇవ్వలేమని ప్రధాని మోదీ ఇప్పుడు చెప్తున్నారు.. కానీ కొన్నేండ్లుగా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకుండా తొక్కిపెట్టారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. కేంద్రంలోని అన్ని శాఖల్లో కలిపి మంజూరైన పోస్టులు 40.78 లక్షలు.. ఇప్పుడు ఉన్న మొత్తం ఉద్యోగులు 31.91 లక్షలు మాత్రమే. అంటే ఎన్నడో మంజూరైన పాత పోస్టులే ఇప్పటికీ 8.87 లక్షలు ఖాళీగా ఉన్నాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఖాళీలనైనా భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో మోదీ సర్కారును కోరుతున్నాయి. తమ విజ్ఞప్తులను బీజేపీ సర్కారు ఎన్నడూ పట్టించుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, వచ్చే నాలుగైదు నెలల్లో కీలక రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో రోజ్‌గార్ మేళా పేరుతో యువతను మళ్లీ మోసం చేయాలని మోదీ సర్కారు చూస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఎంతసేపూ మతం పేరుతో ప్రజలను ఉద్వేగంలో ఉంచటానికే ఫొటోషూట్లు చేస్తున్నారని మండిపడుతున్నాయి. రోజ్‌గార్ మేళా పేరుతో ‘జుమ్లా కింగ్’ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని మోదీపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. మోదీ హామీ ఇచ్చిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు.
మరి తెలంగాణ ఎలా పరిష్కరించింది?
నిరుద్యోగం వందేండ్ల సమస్య అని, దానిని ఇప్పటికిప్పుడు పరిష్కరించలేమని ప్రధాని అంటున్నారు. మరి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అది ఎలా సాధ్యమైందని యువత ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుతం 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అన్నీ కలిపితే దాదాపు 2.21 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాలే 16 లక్షలు తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని, పరోక్షంగా అంతకు మూడింతలు ఉంటాయని అంచనా. ప్రత్యక్ష ఉద్యోగాలు చూసుకొన్నా 18.21 లక్షల ఉద్యోగాలవుతాయి. ఇదే సమయంలో కేంద్రం ఎన్ని పాత ఉద్యోగాలు భర్తీ చేసి, ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించిందని నిలదీస్తున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఓట్లేయించుకొని ఉద్యోగాలివ్వకుండా మోసం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
-2013 నవంబర్ 22న ఆగ్రాలో ఎన్నికల ర్యాలీలో నరేంద్రమోదీ.
నిరుద్యోగం వందేండ్ల నుంచి ఉన్న సమస్య.. దానిని వంద రోజుల్లో పరిష్కరించలేం. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు అలాంటి సమస్యలు రాకుండా మనదేశాన్ని మేం కాపాడాం.
– 2022 అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళా ప్రారంభం సందర్భంగా నరేంద్రమోదీ