హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో బాలికల ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం 73 శాతం సీట్లు బాలికలే సొంతం చేసుకొన్నారు. బాలురు 381 సీట్లు మాత్రమే కైవసం చేసుకొన్నారు. ఆర్జీయూకేటీ సోమవారం సీట్ల కేటాయింపు పూర్తిచేసింది. ఆరేండ్ల బీటెక్ కోర్సు (ఇంటర్+ బీటెక్)ను ఆర్జీయూకేటీలో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,404 సీట్లకుగాను 1,023 సీట్లు అమ్మాయిలే పొందారు. ఇక జిల్లాల వారీగా తీసుకొంటే అత్యధికంగా సిద్దిపేట 212, నిజామాబాద్ 135, కామారెడ్డి 123 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకొన్నారు.
సీటు వస్తే చాలు..
ఆర్జీయూకేటీ బాసరలో సీటు దక్కిందంటే చాలు దాదాపుగా జీవితంలో స్థిరపడ్డట్టే. విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడం ఈ విద్యాసంస్థ ప్రత్యేకత. ప్రతి ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ క్యాలండర్‌ను ప్రకటించి కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో 74.07 శాతం విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయ్యారు. 2019 -20లో 60.86 శాతం, 2018-19లో 53 శాతం విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ దక్కించుకొన్నారు. క్యాప్‌జెమిని, ఏడీపీ వంటి 10కి పైగా సంస్థలు ఏటా విద్యార్థులను ఎంపికచేసుకొంటున్నాయి.