హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారంలో నాయకపోడు తెగ ప్రత్యేకంగా తయారు చేసే మాస్‌లకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను పొందే అవకాశమున్నది. ఈ మాసులను వీరు సుమారు 700 ఏండ్ల నుంచి తయారు చేస్తున్నారు. నాయకపోడు మాస్‌లకు జీఐ ట్యాగ్ సాధించడానికి, నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ గురునానక్ ఇన్ స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మద్దతుతో,
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్(ఐపీఎఫ్‌సీ)లో జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నది. ఇది తమ తెగకు ఒక మలుపు కావొచ్చని నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ పేర్కొన్నారు. ఇది నాయకపోడు కళలు, చేతి పనులను రక్షించడంలో సహాయపడుతుందని చెప్పారు.
నాయకపోడు మాస్లను పొనికి చెక, రంగురాళ్లు, చెట్లసారం, బొగ్గు, బూడిద, అటవీ వనరుల నుంచి సేకరించిన సహజ రంగులను ఉపయోగించి మాస్లను తయారు చేస్తారు. కాకతీయ రాజు సింగబోయడు (సింగభూపాలుడు), భూలక్ష్మి దేవర, ఐదుగురు పాండవులు (కొర్రాజులు), పోతరాజు, వరాహరాజు, ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి, అశ్వం (గుర్రం), ఒక జింక ముఖానికి మాస్లుగా తయారు చేసేవారు. నాయకపోడు తెగ గోదావరి నది ఒడ్డున ప్రధానంగా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో స్థిరపడ్డారు. కానీ కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించారు. వీరు 14వ శతాబ్దపు రేచర్ల పద్మనాయక రాజవంశ పాలకుడు సర్వజ్ఞ సింగ భూపాలుడికి సేవ చేశారని నమ్ముతారు.