కేటీఆర్ సభలతో కాంగ్రెస్‌లో వణుకు
సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన మూడు సభలు సక్సెస్ కావడంతో కాంగ్రెస్‌లో వణుకుపుట్టింది. ఓర్వలేకే ఆ పార్టీ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నరు.. పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
-
ఓర్వలేకే చిల్లర మాటలు..పిచ్చి ప్రేలాపనలు l కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రైతుల వద్దకెళ్లాలి: గాదరి
-
ప్రజలు కష్టాల్లో ఉంటే ఆర్భాటాలకు సర్కార్ దుబారా
-
సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసం జోకర్ ఐలయ్య ఆరాటం
-
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ): ‘సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన మూడు సభలు సక్సెస్ కావడంతో కాంగ్రెస్‌లో వణుకుపుట్టింది. ఓర్వలేకే ఆ పార్టీ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నరు.. పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్, కేటీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరికి డీఎస్పీల సమావేశంలోనూ కేసీఆర్‌ను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. ‘కేటీఆర్ సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడన తెల్లారే సర్కార్ 34 శాతం లాభాల వాటా ప్రకటించిందని గుర్తుచేశారు. ఆదిలాబాద్, నిర్మల్ రైతు గర్జన సభల్లో కేటీఆర్ రాష్ట్ర రైతాంగానికి భరోసానిచ్చారని కొనియాడారు. ప్రజాసమస్యల పరిష్కారంలో, పథకాల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ పరిస్థితుల్లో కేటీఆర్ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని చెప్పారు. చూడకుండా ఐదు నిమిషాలు మాట్లాడలేని రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని దెప్పిపొడిచారు.
బీర్ల ఐలయ్య.. ఓ బ్రోకర్.. జోకర్!
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన విప్ పదవితో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎగిరెగిరిపడుతున్నారని గాదరి కిశోర్ దుయ్యబట్టారు. ఆయన వార్డు మెంబర్‌కు ఎక్కువ, సర్పంచ్ పదవికి తక్కువని ఎద్దేవా చేశారు. ‘ఎమ్మెల్యే కాగానే ఐలయ్య డిఫెండర్ కారు కొనుక్కొని దావత్ చేసిండు.. తెల్లారి బూమరాంగ్ కాగానే మాటమార్చి దాన్ని నా కొడుకు కొనిచ్చిండని బుకాయించిండు.. కానీ స్కూల్ పిల్లగాడికి కారు కొనిచ్చే స్థోమత ఉంటదా? అందుకే ఆయనను జోకర్ అంటున్నం. ఆలేరు నియోజకవర్గంలోని సీలింగ్ భూమిని స్పెక్ట్రా అనే కంపెనీకి కమీషన్లు దొబ్బి అప్పగించిండు. అందుకే బ్రోకర్ అంటున్నం’ అని ఎద్దేవా చేశారు. ఆలేరులో 10 వేల మంది బీర్ల ఐలయ్య బాధితులున్నారని, ఐలయ్య బ్రోకర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ తిరిగిరాగానే ఐలయ్య భూఅక్రమాలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
దమ్ముంటే రైతుల వద్దకెళ్లండి
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా.. మీకు దమ్మూ, ధైర్యముంటే కష్టాల్లో ఉన్న రైతుల వద్దకెళ్లండి. ప్రాజెక్టులు, పొలాలను చూడండి. అంతేగాని పిచ్చి డ్రామాలు బంద్పెట్టండి’ అని గాదరి కిశోర్ తూర్పారబట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏదో అన్యాయం చేశారని కాంగ్రెస్ మొనగాళ్లందరూ అసెంబ్లీ నుంచి బస్సులేసుకొని కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి ఏం తేల్చారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డీ.. నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌ను మించి చేసి చూపాలని, నోటికొచ్చినట్టు వాగి పలుచన కావొద్దని హితవు పలికారు. కేసీఆర్ తమ్మిడిహెట్టి కట్టలేదని సిగ్గులేకుండా ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రాలో, మహారాష్ట్రలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడూ మూడేండ్ల తర్వాత నిద్రలేచి ఏదో సాధించామని పగటికలలు కంటున్నారని దుమ్మెత్తిపోశారు. నియోజకవర్గ ప్రజలు తనను మరిచిపోతున్నారని, గెలిచే పరిస్థితిలేదనే భయంతోనే మళ్లీ ప్రజలకు తనను గుర్తు చేసుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో సభలు పెట్టుకున్నారని గాదరి కిశోర్ ఎద్దేవా చేశారు.
ఒకేచోట మూడుసార్లు సభలు పెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, ఆయన భార్యకు పంచాయితీ నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లోనే సీఎం మూడురోజులు నియోజకవర్గంలో తిష్టవేశారని విమర్శించారు. అప్పులు పుట్టడంలేదని, ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది అవుతున్నదని చెప్తున్న సీఎం.. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ పేరిట సర్కార్ సొమ్మును దుబారా చేస్తున్నారని గాదరి కిశోర్ ధ్వజమెత్తారు.
కేటీఆర్ మీటింగ్‌లు పెడితే భయమెందుకు?: కూసుకుంట్ల
కేటీఆర్ సభలు పెడితే కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ లెజెండ్ అని ఐటీ అభివృద్ధి, పరిశ్రమలు తేవడంలో కీలభూమిక పోషించారని కొనియాడారు. ప్రజలను గాలికొదిలి కమీషన్లు దండుకొనే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే పంటలు కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఆడిస్తే ఇకడ రేవంత్‌రెడ్డి ఆడుతున్నాడు. ఆంధ్రోళ్లను సలహాదారులుగా పెట్టుకొని గోదావరి, కృష్ణా నీళ్లను దిగువకు వదిలిపెట్టి తీరని అన్యాయం చేశారు’ అని విమర్శించారు. కేసీఆర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్సోళ్లను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి: ఒంటెద్దు
కరువుతో రైతాంగం అల్లాడుతుంటే సోయిలేని సర్కార్ పెద్దలు సమ్మిట్ల పేరిట నాటకాలాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సమ్మిట్లతో రైతులకు ఉపయోగం లేదని, వానకాలం పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సమ్మిట్‌లో తెచ్చామన్న పెట్టుబడులు ఎకడికి పోయాయని ప్రశ్నించారు. 7లక్షల పైచిలుకు కోట్లు ఎకడ పోయాయని నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి డబ్బులు పంపేందుకే ఆర్భాటపు ఖర్చలు చేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో జరుగాల్సిన గ్లోబల్ సమ్మిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ధర్మేందర్‌రెడ్డి, కడారి స్వామి, హరిబాబు, మిథున్, శీనునాయక్, పడాల సతీశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

