చెరువు నీళ్లకు వేలంపాట!
చెరువుల్లో వదిలిన చేపలకు వేలం పాడటం అందరికీ తెలుసు.. కానీ చెరువులోని నీటికి వేలం పాడటం గురించి విన్నారా? కానీ ఇది నిజం. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మరో నిదర్శనం.
- ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సాగునీటి అర్రాస్
- మహబూబ్‌నగర్ జిల్లా మియాపూర్‌లో నల్లకుంట, ఊర బావి నీటికీ వేలం
- రూ.3.81 లక్షలకు దక్కించుకున్న రైతులు
- కృష్ణా నది సమీప గ్రామంలో సాగునీటి గోస
- పంటలు కాపాడుకునేందుకు రైతుల తండ్లాట
మహబూబ్‌నగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెరువుల్లో వదిలిన చేపలకు వేలం పాడటం అందరికీ తెలుసు.. కానీ చెరువులోని నీటికి వేలం పాడటం గురించి విన్నారా? కానీ ఇది నిజం. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మరో నిదర్శనం. పంటలను కాపాడుకొనేందుకు రైతులు ఏకంగా ఊరిలో ఉన్న చెరువు, కుంటను, బావిని వేలం పాడాల్సి వచ్చింది. చేతికి వచ్చిన పంట ఎండిపోతున్న తరుణంలో, ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వేలంపాటలో గెలుచుకున్న నీటిని పంటలకు తరలిస్తున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే కావడం గమనార్హం. ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగడం విచారకరం. మిగతా ఆయకట్టు రైతులు ఈ వ్యవహారంపై వనపర్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.
మూడు జలవనరులు.. 3.81 లక్షలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం మియాపూర్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతున్నాయి. గ్రామంలోని చెరువులు, కుంటలు, బావుల్లోనూ నీళ్లు పరిమితంగా ఉండటంతో సాగునీటి కోసం రైతులు పోటీ పడ్డారు. దీంతో చెరువులు, కుంటలు, బావుల్లోని నీటి కోసం వేలంపాట నిర్వహించారు. గ్రామ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం పాట జరిగింది. సుమారు పది మంది రైతులు నల్లచెరువును రూ.రెండు లక్షలకు, ఊరకుంటను రూ.లక్షకు, ఊరబావిని రూ.81 వేలకు దక్కించుకున్నారు.
ఈ గ్రామం కృష్ణానదికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కృష్ణానది నీళ్లు సకాలంలో ఎత్తి ఉంటే, చెరువులన్నీ నింపి కాలువల ద్వారా నీళ్లు విడుదల చేసేవారని, ఈ దుస్థితి ఉండేది కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ నీటిని అమ్ముకుంటున్నారని, రోజుకు మోటర్ ద్వారా నీటిని తోడితే రూ.7 వేలు ఇవ్వాలని షరతు విధించారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 30 మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో అసలైన ఆయకట్టు రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా సుమారు 200 ఎకరాల్లో సాగు చేసిన వరి నీరు లేక ఎండిపోతున్నది. ఓవైపు ఇప్పటికే రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టినా పంట చేతికి వస్తుందో రాదో?ననే బెంగ, మరోవైపు రోజుకు రూ.7 వేలు కట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేలంపాటపై కొందరు రైతులు వనపర్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రాంతం, సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ఈ దుస్థితి రావడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. కృష్ణానదిలో వరద వచ్చినప్పుడే ఎత్తిపోసి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు వాపోతున్నారు. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టారని, ఆ పనులను పూర్తిచేసి, మోటర్లను నడిపి ఉంటే వేలం వేయాల్సిన దుస్థితి కలిగేది కాదని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

