హైదరాబాద్ : తెలంగాణా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్(Police Housing Corporation) ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులు, అకౌంట్స్ విభాగాన్ని మరింత పకడ్బందీ నిర్వహణ చేపట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం చైర్మన్ కోలేటి దామోదర్(Chairman Koleti) అధ్యక్షతన మంగళవారం జరిగింది.
పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనులలో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రస్తుతం ఉన్న క్వాలిటీ కంట్రోల్(Quality Controll) విభాగాన్ని పటిష్టం చేసేందుకు ఈ విభాగంలో నిపుణులైన అధికారులను తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న అకౌంట్స్ విభాగాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక సీనియర్ అధికారిని డిప్యూటేషన్ పద్ధతిపై నియమించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, పోలీస్ కార్పొరేషన్ ఎం.డీ. రాజీవ్ రతన్,అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, డీఐజీ రమేశ్ రెడ్డి, కార్పొరేషన్ సీ.ఈ విజయ్ కుమార్, రక్షిత మూర్తి తదితరులు పాల్గొన్నారు.