హైదరాబాద్, జనవరి9 (నమస్తే తెలంగాణ): పేరుకు అది సంక్షేమ శాఖ కార్యాలయం.. కానీ ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్త. శాఖకు సంబంధించిన కమిషనర్లు, ఉన్నతాధికారులు, చైర్మన్లు నిత్యం చూస్తూ కూడా ఏమీ పట్టనట్టు ఉంటారు. అధికారుల పర్యవేక్షణాలోపానికి మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. డీఎస్ఎస్ భవన్‌లోని 6వ ఫ్లోర్లో బీసీసంక్షేమశాఖ కమిషనర్, బీసీ శాఖ పరిధిలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీతోపాటు సెక్షన్ ఆఫీసర్ల చాంబర్లు కూడా ఉన్నాయి. ఇటీవల బీసీ సంక్షేమశాఖకు చెందిన ఉన్నతాధికారులు, చైర్మన్లకు సంబంధించిన చాంబర్లను రీ మోడల్ చేశారు. సీలింగ్‌తోపాటు, హంగు ఆర్భాటాలు కల్పించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆయా గదుల నుంచి తొలగించిన ఫర్నిచర్‌ను, ఇతరత్రా సామగ్రిని మాత్రం మెట్లపైనే నిర్లక్ష్యంగా వదిలేశారు. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, చైర్మన్లు చూస్తూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. భవన్‌కు వచ్చిన విజిటర్స్ సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టి చాంబర్లను శ్రద్ధగా తీర్చిదిద్దుకున్న అధికారులు, భవన్ పరిసరాలను శుభ్రంగా ఉంచకపోవడాన్ని తప్పుబడుతున్నారు.