రాజన్న సిరిసిల్ల, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల పేరిట వల వేసి.. ఒక్కొక్కరి నుంచి పదివేల దాకా వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపూర్‌కు చెందిన ఎర్రబద్ది గోపి.. ‘ట్రాన్జ్ ఇండియా కార్పొరేషన్ నెట్వర్క్’ పేరిట కంపెనీ ఏర్పాటు చేశాడు. దానికోసం ఓ లోకల్ యాప్ కూడా తయారు చేయించాడు. అందులో పనిచేయడం కోసం అనంతపూర్‌కు చెందిన కురుబ అశోక్‌కుమార్, మాదిగ బ్రహ్మేంద్ర, సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన మాదిగ స్వాతి, కురుబ వరలక్ష్మిని చేర్చుకున్నాడు. హెల్త్‌కేర్, పర్సనల్ కేర్, హోం కేర్, ఫ్యాషన్ వేర్, గోల్డ్ అండ్ డైమండ్‌కు సంబంధించిన వస్తువులను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి లింక్‌లు పంపించాడు.
ఒక్కొక్కరి వద్ద రూ.10వేల చొప్పున వసూలు చేసి కంపెనీ ఐడీ ఇచ్చాడు. మరికొంత మందిని కంపెనీలో చేర్పిస్తే కమీషన్ వస్తుందని నమ్మించాడు. ఇలా నిరుద్యోగులను మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో చేర్చుకుంటూ పెద్ద మొత్తంలో కమీషన్ పొందాడు. వీరి ప్రకటనలను నమ్మిన సిరిసిల్లకు చెందిన దూస రమ్య తనకు ఉద్యోగం కావాలని మేసేజ్ చేసింది. అందుకు గోపి స్పందించి ఉద్యోగం ఇస్తామని చెప్పి దాదాపు రూ.10 పదివేలకుపైనే వసూలు చేశాడు. తీరా మోసపోయానని గ్రహించిన ఆమె ఇటీవల సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసిన సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏపీలోని అనంతపూర్‌లో ఆ ఐదుగురు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి సిరిసిల్లకు తీసుకొచ్చారు. ఈ కంపెనీపై పదికిపైగా ఫిర్యాదులున్నట్టు ఎస్పీ తెలిపారు.
ముంబై పోలీసులమని 3.40 లక్షలు టోకరా
ఎదులాపురం, జూలై 20 : ముంబై పోలీసులమని చెప్పి 3.40 లక్షలు టోకరా వేశా రు. ఆదిలాబాద్‌లోని టీచర్కాలనీ నివాసి అయిన రిమ్స్‌లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినికి 12న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘మేము ముంబై పోలీసు లం.. మీ ఫోన్ ఐడీ వేరొకరి పేరిట ఉన్నది. ఆ ఐడీపై నేరాల కేసులు ఉన్నాయి. వెంటనే మీ ఫోన్ ఐడీతో బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బును మేము చెప్పిన నంబర్‌కు పంపించాలి’ అని భయపెట్టించారు. వైద్య విద్యార్థిని వారు చెప్పిన ఖాతాకు రూ.3.40 లక్ష లు బదిలీ చేసింది. అనంతరం ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని భావించి అదేరోజు సైబర్ క్రైమ్1930 నంబర్‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు అప్పటికప్పుడు రూ.లక్ష మాత్రం ఫ్రీజ్ చేయించగలిగారు.